నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఇటీవల విడుదలైన చిత్రానికి విశేషాదరణ లభిస్తోంది. వినోదాత్మక ఈ చిత్రంగా మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఈ మూవీపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. అసలు విషయం ఏంటంటే.. జాతిరత్నాలు సినిమాలో దేశభక్తి ప్రబోధాత్మకమైన ఓ కవితను వ్యంగంగా ఆలపించారని శివసేన తెలంగాణ విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరికొయ్యకు వేలాడే ముందే సర్ఫరోష్ కీ తమన్నా హబ్ హమారే దిల్ మే హై అంటూ పాడిన పాటను జాతిరత్నాలు చిత్రంలో అవమానకరీతిలో ఆలపించారని, ఆ గేయం పంక్తుల్లో టాలీవుడ్ హీరోయిన్ల పేర్చు చేర్చి వ్యంగ్యంగా మార్చేశారని శివసేన నేతలు ఆరోపించారు.
ఈ మేరకు శివసేన తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి భూమా గంగాధర్, ఇతర నేతలు హైదరాబాదులోని కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచేలా వ్యవహరించిన సినిమా దర్శకుడు, నటీనటులు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ సినిమాను నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.