చలి పులి..జాగ్రత్త!

5
- Advertisement -

తెలంగాణ రాష్ట్రాన్ని ఎముకలు కొరికే చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొద్దుపోయినప్పటి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రజలు అవసరం లేకపోతే బయటకు రాకుండా ఉండాలని, వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల సెల్సియస్‌ కంటే దిగువన నమోదయ్యాయి. సంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో అయితే 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మొత్తం 19 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈశాన్య భారతం నుంచి వీచే చలి గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల దిగువకు పడిపోయే అవకాశముందని పేర్కొన్నారు.

శనివారం జనగామ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలకు, ఆదివారం 22 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అమలులోకి తెచ్చింది. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

- Advertisement -