అటకెక్కిన సీఎంఆర్ఎఫ్‌..పెండింగ్‌లో 80 వేల దరఖాస్తులు

28
- Advertisement -

అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు ముఖ్యమంత్రి సాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 45 రోజులు దాటుతున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీకి అతీగతీ లేకుండాపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ తో ఆగిపోయిన ఈ ఆర్థికసాయం ఎప్పుడు అందుతుందా అని రోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది పేషెంట్లు విలవిలలాడుతున్నారు. మరో నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుండటం, పేషెంట్ల పాలిట శరాఘాతంగా మారే ప్రమాదం లేకపోలేదు.

సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థికసాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఒక విధానపర నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది. ఈ మొత్తం దాదాపు ₹ 350 కోట్లు ఉంటుందని అంచనా. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్దంగా ఉంచిన 35 వేలు అంటే సుమారు ₹ 150 కోట్ల విలువైన చెక్కులు డిస్పాచ్ కు నోచుకోకుండా పోయాయి. డిసెంబర్ 5 వ తేదీతో ఎన్నికల నియమావళికి తెరపడి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కొలువుదీరడం లాంటి పరిణామాలు జరిగిన తరవాత కూడా పెండింగులో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. చెక్కులు సిద్దంగా ఉన్న 35 వేలకు తోడు మరో 45 వేల దరఖాస్తులు సెక్షన్లో పెండింగులో ఉన్నాయి. వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు. ఈ అంశంపై ప్రభుత్వం ఒక విధానపర నిర్ణయం తీసుకోకపోవడమే పెండింగుకు ప్రధాన కారణం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. పైగా పాత దరఖాస్తుల్లో అధికశాతం అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.

ఈసారి ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉంది. ఒకవేళ సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే, వాటిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు వెళ్తుంది. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కుల పంపిణీ చేపడిటే, ఆ పేరు కూడా అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్న మరో రాజకీయకోణం. దీంతో వందలాది మంది సీఎంఆర్ఎఫ్ కోసం సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమ చెక్కుల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

గత ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ఆర్థిక స్థోమత అంతగా లేని రోగులు తమ స్థానిక ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధులను ఆశ్రయించి సీఎంఆర్ఎఫ్ కోసం అర్జీలు పెట్టుకునేవాళ్లు. దరఖాస్తుల స్క్రూటినీ, డాక్టర్ల కమిటీ పరిశీలన తరవాత సంబంధిత విభాగం ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. అప్లికేషన్ అందిన రెండు నెలల్లో చెక్కులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకునే వాళ్లు. సీఎంఆర్ఎఫ్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రత్యేక ముద్ర వేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరవాత సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ది పొందిన కుటుంబం తెలంగాణలో దాదాపుగా లేదనే చెప్పాలి. ఇక ఎమ్మేల్యేలు కూడా సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి వాటిని ఫాలో చేసేవాళ్లు. ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అప్పజెప్పి నిధులు మంజూరు చేయించుకునే వాళ్లు. అటు సెక్రటరియేట్లో సైతం సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఉండేది. దరఖాస్తులను భద్రత, బిల్లుల తనిఖీ, చెక్కుల జారీ కోసం ఒక పకడ్బందీ యంత్రాంగమే పని చేసేది. ఒకవేళ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స తీసుకున్నప్పటికీ, ఆ ఖర్చు పరిమితి దాటితే, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన అనేక మంది పేదలు అప్పుల బారిన పడకుండా సమయానికి ఆర్థిక సాయం అందేది.

అలా ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగుతున్న సీఎంఆర్ఎఫ్ పథకం అకస్మాత్తుగా నిలిచిపోయింది. పెండింగులో ఉన్న చెక్కులు విడుదల ఐతేనే, చికిత్స కోసం చేసిన అప్పుల ఊబిలోంచి నిరుపేదలు బైటపడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి చేరగానే, బడ్జెట్ సమావేశాల బిజీ మొదలవుతుంది. ఇప్పటికే జనవరి నెల కూడా సగం గడిచిపోయింది. మరో నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మరోసారి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఫలితంగా వచ్చే మే నెల వరకు సీఎంఆర్ఎఫ్ నిలిచిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించి 80 వేల మంది నిరుపేదలకు అపన్నహస్తం అందాలంటే, గత ఏడాది నవంబర్ నెల నుంచి ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న రీయంబర్స్మెంటు అప్లికేషన్లపై ఒక స్పష్టమైన నిర్ణయం జరగాలి.

Also Read:TTD:ఏప్రిల్ శ్రీవారి దర్శన టికెట్ల కోటా రిలీజ్

- Advertisement -