నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి

3
- Advertisement -

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగునీటి విడుదలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్ర మంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో వెంటనే సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టెలీమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గారిని ఆదేశించారు.

Also Read:కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేస్తాం: కేటీఆర్

- Advertisement -