CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

9
- Advertisement -

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా… రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా…? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Also Read:KTR: బండి సంజయ్‌పై సుప్రీం కోర్టుకు కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

- Advertisement -