శివయ్య సాక్షిగా మూసి ప్రక్షాళన చేసి తీరుతా:రేవంత్

1
- Advertisement -

పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాలుష్య కాసారంగా మారిన మూసీకి పునరుజ్జీవం తేవాలని జన్మదినం రోజున పాదయాత్ర చేసి సంకల్పం తీసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుని సంగమస్థలి మూసీ ఒడ్డున భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పడవలో ప్రయాణించి కలుషితాలతో ప్రవహిస్తున్న మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ వెంట పాదయాత్ర చేస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. మూసీ కాలుష్య కాసారంగా మారిన కారణంగా తలెత్తుతున్న విష పరిణామాలను వివరించారు. జన్మదినం రోజున శివయ్యను దర్శించుకుని మూసీ పునరుజ్జీవం చేస్తామన్న సంకల్పం తీసుకోవడంతో జన్మ ధన్యమైందిగా భావిస్తానని చెప్పారు.

మూసీ పునరుజ్జీవ సంకల్పంలో భాగంగా 2025 జనవరి మొదటి వారంలో మూసీ కృష్ణా నదిలో కలిసే వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు.మూసీ కాలుష్యం అణుబాంబుకన్నా ప్రమాదకరంగా మారిందని, పరీవాహక ప్రాంతాలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, అలా చేస్తే పౌరుషాల గడ్డ నల్గొండ జిల్లా ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

అనంత పద్మనాభుడి పాదాల చెంత పుట్టిన మూసీని ప్రక్షాళన చేయడానికి దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చారని, ప్రతి ఒక్కరూ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Also Read:గురుకులాల్లో బర్త్ డే వేడుకలా?

- Advertisement -