సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

4
- Advertisement -

సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, కాంట్రాక్ట్ కార్మికుల‌కు రూ.5 వేలు చొప్పున బోన‌స్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ప్ర‌క్రియ‌లో సింగ‌రేణి కార్మికులు అగ్ర‌భాగాన నిలిచార‌ని, ఉద్యమాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ల‌డంతో గ‌ని కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. అనంత‌రం సింగ‌రేణి లాభాలు, విస్త‌ర‌ణ‌.. బోన‌స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క విలేక‌రుల‌కు వివ‌రించారు.

రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్న సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోంది. సింగ‌రేణి కార్మికుల శ్ర‌మ‌తో 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించ‌గా మిగిలిన‌వి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్ల‌ను కార్మికుల‌కు బోన‌స్‌గా ప్ర‌క‌టిస్తున్నాం. సింగ‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు అందించ‌నున్నాం. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు మాత్ర‌మే. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకొక్క‌రికి అద‌నంగా అందుతున్న మొత్తం రూ.20 వేలు.

సింగ‌రేణి సంస్థ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం బోన‌స్ ప్ర‌క‌టించింది. సంస్థ‌లో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌ని చేస్తున్నారు. వారంద‌రికీ తొలిసారిగా రూ.5 వేల బోన‌స్‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క తెలిపారు. ద‌స‌రా పండ‌గ‌కు ముందే ఈ మొత్తాన్ని వారికి అంద‌జేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Also Read:ఢిల్లీ అరవలి ఫారెస్ట్‌లో గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -