తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనతకు సిద్ధమయ్యారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఆయన లీడర్‌షిప్‌పై ప్రత్యేక కోర్సు చేయనున్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ విద్యాసంస్థలలో ఒకటిగా పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహించే “Leadership for the 21st Century” అనే కోర్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్సు సర్టిఫికెట్ అందుకోబోతున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరవుతున్న తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన గుర్తింపు పొందనున్నారు.
ఈ నెల 25 నుంచి 30 వరకు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఉన్న హార్వర్డ్ కెనడీ స్కూల్ క్యాంపస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఈ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, విధాన రూపకర్తలు, పరిపాలన నిపుణులతో కలిసి తరగతులకు హాజరై ఆధునిక నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ పొందనున్నారు.
21వ శతాబ్దానికి అవసరమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, సంక్షేమ విధానాల అమలు, సమర్థవంతమైన నాయకత్వం వంటి అంశాలపై ఈ కోర్సులో లోతైన అవగాహన కల్పిస్తారు. ముఖ్యమంత్రిగా ఈ అనుభవం తెలంగాణ పాలనకు మరింత ఉపయోగపడనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

