యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చలేవు. తల్లిదండ్రులకు దుఃఖం తప్ప. మీ కుటుంబానికి కష్టాలు తప్ప. అదే క్రీడల్లో రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా మీ కుటుంబానికి గౌరవం తెస్తారు. అంతే కాకుండా దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే ఇనుమడించే క్రీడాకారులుగా రాణిస్తారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 (ChiefMinistersCup 2024)ను ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడల మస్కట్, లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమ చివర్లో క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు.
క్రీడాకారులు కఠోరమైన శ్రమతో రాణించాలి. ఇటీవలి ఒలంపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయాం. 2028 లో భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ప్రతిజ్ఞ తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది” అని క్రీడాకారుల హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
క్రీడాకారులను ప్రోత్సహించడానికి, క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలను ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read:మంత్రి కొండాకు నాగ్ లీగల్ నోటీసులు!
బాక్సింగ్‌లో దేశానికి తలమానికంగా క్రీడాకారిని నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ఎలా ప్రోత్సహిందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం.
అండర్ 17 జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. వారికి కావలసిన శిక్షణను హైదరాబాద్‌లో అందిస్తామని ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడా.
పట్టుదల, ప్రయత్నం ఉంటే విజయం సాధిస్తారు. అందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉదాహరణ. 16 ఎకరాల్లో ఉన్న ఆ ఒక్క యూనివర్సిటీ ఒలంపిక్స్‌లో ఏకంగా 32 బంగారు పతకాలను సాధించింది.
క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YoungIndiaSportsUniversity), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YoungIndiaSportsAcademy)లను స్థాపించాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. గురుద్వార్, మందిరం, మసీదు, ఒక చర్చ్ వంటి ప్రార్థనా మందిరాలకు ఎవరికి వారు వెళ్తారు. కానీ మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడామైదానం ఒక్కటే. ఎల్బీ స్టేడియం అద్బుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది నగర క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.