తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (AAI)కి అందజేసినట్టు తెలిపారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి గారు వివరిస్తూ, వరంగల్‌తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌లలో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు. వరంగల్ తో పాటు మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ దూరం ఉండాలన్న నిబంధన అడ్డురాదని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించినట్టు సీఎం గారు వివరించారు. ఆ భూమి వివరాలు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందజేశామని, వెంటనే విమానాశ్రయ ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read:రేవంత్‌ది నియంతృత్వ ధోరణి:కవిత
పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ, అందుకు ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించామని, దానిపై తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తి స్థాయి కార్యకలాపాల విస్తరణకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని, అదనంగా అవసరమైన భూమిని సేకరించి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు.