మూడోవిడుత హరితహారానికి శ్రీకారం

287
cm-launch-haritha-haram-karimnagar
cm-launch-haritha-haram-karimnagar
- Advertisement -

ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం మూడోవిడుతకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద మొక్కలు నాటి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి రెండు పర్యాయాలు నిర్వహించిన కార్యక్రమంలో 49 కోట్ల మొక్కలు నాటగా, మూడో ఏడాది ఏకంగా 40 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడంలో సామాన్య ప్రజలతో పాటు సినీతారలు కూడా ముందుకు వచ్చారు.. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్, చిరంజీవిలతో పాటు.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, లక్ష్మి మంచు, రెజినా కాసాండ్రా.. ఇలా పలువురు పాల్గొని మొక్కలు నాటారు.  ఈ సారి కూడా అందరి భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న హరిత దళాలు (గ్రీన్ బ్రిగేడ్స్) ఇప్పటికే వాడవాడలా కదం తొక్కుతున్నాయి. మొక్కలు నాటడంతోపాటు ఏడాది పొడవునా వాటిని సంరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల సంరక్షణకు కృషిచేసిన వారికి హరితమిత్ర అవార్డులతో పాటు రూ. లక్షనుంచి రూ. 15 లక్షల చొప్పున సుమారు రూ.15కోట్ల విలువచేసే నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.

HARITHAHARAM

గతేడాది నాటిన మొక్కలను మించి ఈసారి నాటేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు.. అన్నింటికి మించి సాధారణ ప్రజలు సంసిద్ధమవుతున్నారు. కోరినవారికి కోరినన్ని మొక్కలు అదించేందుకు అటు అటవీశాఖ సైతం సమాయత్తమయింది. వెరసి.. రాష్ట్రమంతటా హరిత సందడి నెలకొంది. ఈ మహత్తర కార్యక్రమం మూడో విడుతను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ఉదయం కరీంనగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ తొలి రోజు 25వేల మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

haritha-haram-cover-697-11-1468236379

హరితహారం కార్యక్రమంలో బాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే సామాన్య పౌరులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక బహుమతులిచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. హరితహారంలో ఉత్సాహంగా పాల్గొనే విద్యార్థులకు హరిత విద్యార్థి అవార్డులను, మొక్కలను బాగా పరిరక్షించే పాఠశాలలకు హరిత పాఠశాల అవార్డులనివ్వనున్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని మించి మొక్కలను నాటే పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలకు రెండు లక్షల నుంచి 10లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటా చెట్టు-ఊరంతా పచ్చదనం అన్న నినాదంతో అటవీ శాఖ, పచ్చని పాఠశాల-హరిత తెలంగాణ నినాదంతో విద్యాశాఖ తెలంగాణ హరితహారం కార్యక్రమానికి భారీ సన్నాహాలు చేస్తున్నాయి.

Haritaharam-kcr

హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇప్పటికే సర్కారు పేర్కొంది. ఈ మొక్కల్ని జియోట్యాగింగ్‌ చేయడం ద్వారా వాటి స్థితిగతులు తెలుసుకునే ఏర్పాట్లు చేస్తోంది. హరితహారం కార్యక్రమానికి అవసరమైన సామగ్రి, గుంతల తవ్వకం, కూలీలకు డబ్బు చెల్లింపు తదితర వివరాలను అటవీశాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ఇప్పటికే సీఎస్‌ ఎస్పీసింగ్‌ అధికారులకు తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చూడాలని ఇప్పటికే ఆదేశించారు. గ్రామ స్థాయిలో మొక్కల పర్యవేక్షణ బాధ్యతను వార్డు సభ్యులు, సర్పంచులకు అప్పగించనున్నారు. గతేడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమైన రెండేండ్లలో ఇప్పటివరకు మొత్తం 49కోట్ల మొక్కలను నాటారు.

- Advertisement -