హుస్సేన్ సాగర్‌లో జరిగినట్టే గోదావరిఖని వద్ద గోదావరి నదిలో కూడా నిత్యం రెగెట్టా పోటీలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ ను ఆదేశించారు. ‘తెలంగాణ మత్స్యవీర కేసీఆర్ కప్ పేరిట’ గోదావరి ఖని సమీపంలో గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు నిర్వహించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ముఖ్యమంత్రి అభినందించారు.
దండం పెట్టి నదిలో పైస బిల్లలు వేయడానికి నీళ్ల కోసం వెతికిన కాలం చూసిన తెలంగాణ నేడు నిండు గోదావరిలో పడవల పోటీలు నిర్వహించే స్థాయికి చేరిందన్నారు. గోదావరి జలాల్లో పడవల పోటీలు నిర్వహించాలనే ఆలోచన వచ్చి, దాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే చందర్ చొరవ అభినందనీయమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా సుందిళ్ల బ్యారేజి నుంచి ఎల్లంపల్లి బ్యారేజి వరకు 41 కిలోమీటర్ల గోదావరి నది సజీవంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. నదిలో నీటి ప్రవాహం లేని సమయాల్లో జలక్రీడలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ పరస్థితిని ఉపయోగించుకుని పర్యాటక, క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు.
హుస్సేన్ సాగర్‌లో ప్రతీ ఏటా రెగెట్టా పోటీలు జరుగుతాయని, అలాంటి పోటీలు నిర్వహించడానికి గోదావరి ఖని కూడా ఎంతో అనువుగా ఉంటుందన్నారు. నీటి పారుదల శాఖ, క్రీడా, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సేలింగ్ క్లబ్ వారి సహకారంతో పడవల పోటీలు నిర్వహించాలన్నారు. దీనికోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.