చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన గళాన్ని వినపిస్తునే వుంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు.
తమ తమ వృత్తులను తర తరాలుగా నిర్వర్తిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన సబ్బండ వృత్తి కులాలైన బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత దిశగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం సుధీర్ఘంగా చర్చించింది. ఉత్పత్తిలో భాగస్వాములౌతూ, సభ్య సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న బీసీ (ఓబీసీ) కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో మరింత దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద వున్నదని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది.
Also Read:Drugs Case:నవదీప్‌కు ఊరట
ముఖ్యంగా.. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సెషన్‌లోనే(14 జూన్ 2014) బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందనే విషయాన్ని సమావేశం గుర్తుచేస్తూ మరోసారి చర్చించింది. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపి తొమ్మిదేండ్లు గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తూ, బీసీ రిజర్వేషన్లపై తాత్సారం వహించడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సామవేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో బీసీలకు సరియైన ప్రాధాన్యత దక్కినప్పుడే వారి సమ్మిళితాభివృద్ధి సాధ్యమౌతుందని పునరుద్ఘాటించింది. ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందే దిశగా చిత్తశుద్దితో చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సమావేశం మరోసారి డిమాండు చేసింది. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ.. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల్లో దాగివున్న శక్తిని వెలికితీసి వారికి సహకరిస్తూ వారిని అభివృధ్ధిలో భాగస్వాములను చేసినప్పుడు మాత్రమే ఏ సమాజమైనా కూడా ప్రగతి పథంలో పయనిస్తుందనే వాస్తవాన్నిస్పష్టం చేసింది. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదాహరణలతో సహా విశ్లేషించింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆధర్శంగా నిలిచిందని సమావేశం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. అందులో భాగంగా ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటరీ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది. కాగా… చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే (14 జూన్ 2014) ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం ఇంతవరకు పట్టించుకోకపోవడంపై సంయుక్త సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. మహిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్దిని ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు.
Also Read:మిస్టర్ ఇడియట్.. ఫస్ట్ లుక్