ఈచ్‌ వన్‌- టీచ్‌ వన్‌ – సీఎం కేసీఆర్

461
kcr
- Advertisement -

2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సిఎం అన్నారు. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. Each one – teach one అనే నినాదం అందుకుని ప్రతీ ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని సిఎం కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.

‘‘ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, అనేక మంది ప్రశంసలను అందుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకున్నది. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే శక్తిని తెలంగాణ రాష్ట్రం సంతరించుకున్నది.

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరింత పురోగమిస్తుంది. మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది కూడా మనందరికీ గర్వకారణం. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగాం. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రాబోయే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వంద శాతం అందుతాయి, రాష్ట్రం సుభిక్షం అవుతుంది. తెలంగాణ నేల నుంచి కరువును శాశ్వతంగా పారద్రోలగలగడం సాధ్యమవుతుంది. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం’’ అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

‘‘అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండడం ఓ మచ్చగా మిగిలింది. గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెలంగాణ రాష్ట్రం అధిగమించి తీరాలి. తెలంగాణ రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్నభరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదే విధమైన స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రదిష్టను రూపుమాపాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -