యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌..

63
- Advertisement -

ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం పూజలు చేశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందజేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు.

కళ్యాణ కట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు.

సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మేల్యేలు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు.

- Advertisement -