ఎన్టీపీసీ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్:సీఎం కేసీఆర్

334
ntpc kcr
- Advertisement -

తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీకి అనుమతి ఇస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని శనివారం సాయంత్రం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించిన సీఎం విద్యుత్తు ఉత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో సమూల మార్పులు తెచ్చి, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్… కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది జూలై నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 6వేలకు పైగా మెగావాట్ల అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం వృద్దిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీపీసీ ప్లాంట్ల ద్వారా కనీసం 2వేల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేయాలన్నారు.

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందువల్ల ఎన్టీపీసీ నుంచి వెంటనే 2 వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. రామగుండంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంటులో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు వచ్చే ఏడాది అక్టోబర్ లో, మరో రెండు యూనిట్లు 2021 ఫిబ్రవరిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయని ఎన్టీపీసీ అధికారులు చెప్పారు. నిర్ణీత గడువుకన్నా ముందే ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం వారిని కోరారు.

విద్యుత్తు ఉత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్ల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి అనుమతి ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -