రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ,మహారాష్ట్ర సీఎంలు ముఖ్యఅతిథులుగా రానుండగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై వెళ్తారు.
మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఫడణవీస్‌ను కేసీఆర్ ఆహ్వానిస్తారు.
త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను సైతం ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును పరిశీలిస్తున్నారు.
ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంది. త్వరలో దానిని రెండు టీఎంసీలకు పెంచనున్నారు.
కాళేశ్వరం అందుబాటులోకి వస్తే ఇకపై రైతన్నలు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 37లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.