ఉద్యోగ , ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాలతో బుధవారం (మే-16) సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లు, పరిష్కారాలపై మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. ఉద్యోగుల సమస్యలపై ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందించే సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.
వేతన సవరణ సంఘం ఏర్పాటు, మధ్యంతర భృతి, బదిలీలు, సీపీఎస్ రద్దు, సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి తీసుకురావడం, స్పౌజ్, మ్యూచువల్స్ బదిలీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీవో-14, పబ్లిక్‌సెక్టర్ ఉద్యోగులకు పీఆర్సీ, అర్హతగల ఉద్యోగులకు పదోన్నతులువంటి అంశాలన్నింటిపై సీఎం స్పష్టమైన ఆదేశాలిస్తారని భావిస్తున్నారు.
అయితే, ఆర్టీసీ ఉద్యోగుల ఇచ్చిన సమ్మె నోటీసుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం ఉద్యోగులతో చర్చించాల్సిన అంశాలపై మంగళవారం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు, ఇతర డిమాండ్ల విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమయంలో సీఎం స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఆర్టీసీ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ ఇవ్వడాన్ని గుర్తుచేశారు.
మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలు తీసుకున్న కమిటీ… సీఎంకు రిపోర్ట్ అందించింది. అయితే సబ్ కమిటీ రిపోర్టులపై సీయస్ యస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ, న్యాయ, ఇతర శాఖల అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. అయితే ఇవాళ సీఎం కేసీఆర్ నేరుగా తమతో చర్చించనుండడంతో డిమాండ్లు పరిష్కారమవుతాయనే ఆశతో ఉన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.