సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చేయనున్నారు. రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో పరిశీలించనున్నారు. ఈ వారంలో ఐదారు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 4వ తేదీన పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి.. ప్రతి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలకు నెలకు 308 కోట్లు, నగరాలు, పట్టణాలకు 148 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ కాలువలను సరిచేయడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ మరమ్మతులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం సాగుతోంది.