శాసనసభలో రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పెంపు బిల్లు సభలో ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని చెప్పారు. రిజర్వేషన్ల పెంపుపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికల సందర్భంగా 107 బహిరంగ సభల్లో హామీని ఇచ్చానని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు.
ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గిరిజనులు, బీసీ-ఈ రిజర్వేషన్లు కొత్తవేం కాదు.. గతంలో ఉన్నవే అని చెప్పారు. బీసీ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ-ఈ వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు 6 శాతం ఉన్నారు. విభజన తర్వాత రాష్ర్టంలో 9.08 శాతం మంది గిరిజనులు ఉన్నారని తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలపడంతో గిరిజనుల శాతం 10కి పెరిగిందన్నారు. దళితులకు ఒక శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లూ పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్ కు అప్పగిస్తామన్నారు. కమిషన్ నివేదిక మేరకు బీసీలకూ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.