మూడు రోజుల బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.. ఈ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కాకుండా మరేదైనా విశేషం ఉందా అంటే అది కేసీఆర్ రోల్.. క్రికెట్ ఆల్ రౌండర్ లా.. కాలేజీలో ప్రిన్సిపల్ లా అన్నీ తానే అయి మూడు రోజులు సభను అదర గొట్టారు.. ఒకే ఒక్కడు అనిపించుకున్నాడు.. బడ్జెట్ ప్రవేశపెట్టడం దగ్గర నుంచి ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వడం వరకు అన్నీ తానే అయి వ్యవహరించారు సీఏం.. మొత్తం మూడు రోజుల్లో సభ 10 గంటలు పని చేస్తే అందులో 4 గంటల పాటు కేసీఆరే మాట్లాడారు..
కొత్త మంత్రులు కేవలం సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వరకు పరిమితం కాగా మిగతా పనంతా కేసీఆరే కానిచ్చేశారు.. దానికి కారణం మంత్రులు కొత్తవారు కావడం.వారికి ఇంకా శాఖ గురించి పూర్తి అవగాహన లేకపోవడం.. కీలక మంత్రిత్వ శాఖలు చాలావరకు కేసీఆర్ దగ్గరే ఉండటంతో కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారు.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు..విమర్శకు కేసీఆర్ పూర్తి సమాచారంతో వేగంగా సమాధానం ఇస్తూ పోయారు.
అసలు ప్రతిపక్ష సభ్యులకు రెండో మాట మాట్లాడలేని పరిస్థితి సృష్టించారు..విద్యుత్ మీద శ్రీధర్ బాబు సంధించిన ప్రశ్నకు సీఎం బయటకు వెళ్లి మరీ సమాధానం కనుక్కుని వచ్చి మరీ ధీటైన జవాబిచ్చారు.. రుణాలు..వాటి పరిస్థితి గురించి ఒక ఆర్థిక వేత్త స్థాయిలో కేసీఆర్ సమాధానం చెబుతుంటే ప్రతిపక్షాలు మౌనంగా కూర్చుండిపోయాయి..ఇక సీఎం స్వయంగా చూస్తున్న నీటి పారుదల శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రతీ విమర్శకు చాలా అలవోకగా సమాధానం చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.. అంతేకాదు మిషన్ భగీరథ..పోడు భూములు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ వ్యవస్థల బలోపేతం, బీసీఎస్సీఎస్టీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం..రోడ్లు.. ఇలా ప్రతీ అంశం మీద సాధికారికంగా జవాబు చెబుతూ విస్మయానికి గురి చేశారు. ప్రతిపక్షాలు కాగితాలు పట్టుకుని వచ్చి మాట్లాడిన వాటికి కూడా తక్షణం వివరణ ఇస్తూ ఇక మీరు మారరా..ప్రిపేర్ కారా..అన్నట్లుగా విమర్శలు గుప్పించారు..
పార్లమెంటు ఎన్నికలకు రెండు నెలల వ్యవధి కూడా లేకపోవడంతో ఈ సభల్ని కేసీఆర్ తమ ప్రభుత్వ పనితీరును వివరించడానికి చక్కగా వాడుకున్నారు.. కాంగ్రెస్ హయంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపారు.. తాము గత ఐదేళ్లలో మ్యానిఫెస్టోను ఎంత అద్భుతంగా అమలు చేసిందీ వివరించారు.. అంతేగాకుండా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించి సభలో ఉత్సాహం నింపారు.. అతి త్వరలో నిరుద్యోగ పెన్షన్లు ఉంటాయనే చల్లని వార్త కూడా చెప్పారు..ఓన్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఆమోదించుకోవడంతో పాటు పంచాయితీ రాజ్ , జీఎస్టీ సవరణల బిల్లును సభ ఆమోదించింది.. ఆ తర్వాత నిరవధికంగా సభ వాయిదా పడింది..