ఈరోజు సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం గామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం వాసలమర్రి గ్రామస్తులతో గ్రామసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏడాది తిరిగే సరికి ఇప్పుడున్న వాసాలమర్రి.. బంగారు వాసాలమర్రి కావాలని అన్నారు. ఈ ఊరికి కనీసం తాను ఇంకో 20 సార్లు వస్తాను. వచ్చేసారి ఇలా సభ పెట్టను. మీ ఊరిలో నలుగురు మాత్రమే పరిచయం అయ్యారు. అందరూ పరిచయం అయ్యేలా సభ పెట్టాలి. అందరం పట్టుబడితే వాసాలమర్రి ఏడాది నాటికి బంగారు వాసాలమర్రి కావాలి అన్నారు సీఎం.
ఊరిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ఒకర్ని చూస్తే మరొకరు చిరునవ్వు నవ్వాలి. ఒకరికొకరు సహకరించుకునే ప్రేమ ఏర్పడాలి. గ్రామంలో ఐకమత్యం, పట్టుదల అవసరం. కష్టం, బాధ ఎవరిదైనా ఒకటే అనే భావన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్‌గా ఉంటుంది.. అన్ని పనులు జరగాలి. ఇవన్నీ సాధ్యమైతే వందకు వంద శాతం వాసాలమర్రి బంగారంలా తయారవుతుందన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ నాయకత్వంలో అద్భుతమైన పని జరగాలి అని సీఎం తెలిపారు.