తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అన్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్లీనరీని ఉద్దేశించి మాట్లాడిన సీఎం కేసీఆర్… టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడమన్నారు.
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి…. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అనిపేర్కొన్నారు. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం అన్నారు.
కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇక అంతకముందు ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.