మెరుగైన భారత్‌ను నిర్మించి ప్రజలకు అందిస్తాం: సీఎం కేసీఆర్

125
kcr
- Advertisement -

ఝూర్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం కేసీఆర్. గాల్వన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది సైనికులతో పాటు, వారికి నేతృత్వం వహించిన మా తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కూడా అసువులు బాశారు. వారి కుటంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు తో పాటు,నాడు ప్రాణాలు కోల్పయిన సైనికులకు సాయం చేసి, వారి కుటంబాలను సన్మానిస్తామని అప్పుడే ప్రకటించాం. వీరు జార్ఖండ్, పంజాబ్ వంటి ఆరేడు రాష్ట్రాల్లో ఉన్నారు. వీర సైనికులకు ఆర్థిక సహాయం చేసే విషయాన్ని సోదరుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారి వద్ద ప్రస్తావిస్తే వారు దానికి సమ్మతించి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మేము చేయగలిగిన సహాయాన్ని చేశాం అన్నారు.

అన్నింటికంటే ముఖ్య విషయం… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని 2001 లో ప్రారంభించాం. ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా శిబు సోరెన్ హాజరయ్యారు. తెలంగాణ ప్రజల వెన్నంటి నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే ఉన్నారు. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి వుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు నాకు శిబు సోరెన్ గారిని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఫలవంతమైన చర్చలు జరిగాయి. రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా…నేనొక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. 75 సంవత్సరాల స్వాత్రంత్యనాంతరం కూడా దేశం అభివృద్ధి చెందాల్సినంతగా జరగలేదు. ప్రపంచంతో పోల్చితే చాలా విషయాల్లో మనం వెనుకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా అభివృద్ధి చెందింది. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం, దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడి పై ఉంది. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. తర్వాత ఏ ఎజెండాతో ముందుకు పోవాలో, ఎలా ముందుకు పోవాలో, దేశాన్ని మరింత ఉత్సాహంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలను ఏ విధంగా అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలనే విషయాలను చర్చిస్తాం. దీనికి సంబంధించిన విషయాలను తర్వాత మరింతగా మీకు వివరిస్తాం అన్నారు.

భారతదేశాన్ని సరైన దిశలో తీసుకుపోవాల్సిన ఒక గట్టి ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం ప్రారంభమైంది. చర్చలు జరుగుతున్నాయి. యాంటి బిజెపి ఫ్రంట్, యాంటి కాంగ్రెస్ ఫ్రంట్, ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ లాంటివి లేవు. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్న. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్… ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు. భవిష్యత్తులో దీని పై స్పష్టత వస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఆశించిన ఫలాలు ప్రజలకు అందలేదు. కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉంది. ఆ మార్గం ఏంటి? ఎలా చేయాలి? ఏం చేయాలి ? అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదు. భవిష్యత్తులో ఈ విషయాల పై స్పష్టత వస్తుందన్నారు.

పురోగామి భారత్ ను నిర్మించడంలో మీ (జర్నలిస్టుల) పాత్రను కూడా మేము ఆశిస్తున్నాం. దీనికి ఇప్పుడే పేరు పెట్టకండి. నేను చెప్పదల్చుకున్న విషయాలను స్వచ్ఛమైన, మంచి మనసుతో, అర్థవంతంగా చెప్తున్నాను. ప్రస్తుతమున్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్ ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయలనేదే మా ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలవడం జరుగుతున్నది. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో ఇది అయ్యే పని కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరకుతుంది. ఏ దారిలో వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలా లేదా మరోటి ఏర్పాటు చేయాలా అనే విషయాలను మీకు మున్ముందు తెలియజేస్తాం. ఈ దేశ నిర్మాణంలో మీ (జర్నలిస్టుల) గొప్ప భాగస్వామ్యాన్ని మేం ఆశిస్తున్నాం అన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -