నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం అని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కొనియాడుదాం అన్నారు. భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం…. ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందాం అన్నారు.
ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దాం అన్నారు.
జనగామ సింహంగా పేరు గాంచిన నల్లా నర్సింహులునూ, జీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూ, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను సదా స్మరించుకుందాం అన్నారు. నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం అన్నారు.