ఓటు అందరి భవిష్యత్‌ని నిర్ణయిస్తుందన్నారు సీఎం కేసీఆర్. నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ఆయన వెనకున్న పార్టీ గురించి ఆలోచించాలన్నారు. పార్టీల చరిత్ర, వారి విధానం ఏంటో తెలుసుకుని ఓటు వేయాలన్నారు.ఆనాటి నల్గొండకు ఈ నాటి నల్గొండ తేడా గమనించాలన్నారు. పచ్చని వరి పొలాలతో నల్గొండ చూడచక్కగా ఉందన్నారు.
బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్దిని ఓ సారి గమనించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీరు లేవు, కరెంట్ లేదు, సాగునీరు లేవు. వలసలతో గోస పడ్డామన్నారు. ఈ జిల్లా నుండి పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలున్నారు కానీ మంచినీరు ఇవ్వలేదన్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో కరెంట్,సాగు,తాగు నీటి గోస తీరిందన్నారు. నల్గొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పినా…చెప్పిన విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు.
స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. నల్గొండకు ఐటీ టవర్ వచ్చిందన్నారు. ఇవాళ నల్గొండలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ఓసారి గమనించాలన్నారు. త్వరలోనే పెన్షన్‌ని ఐదు వేలకు పెంచబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు, ధరణి తీసేస్తామంటున్నారు…వారు వస్తే మళ్లీ తెలంగాణ చీకటి అవుతుందన్నారు. రైతు బంధు ఉండాలంటే భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. రైతు బంధును రూ.16 వేలకు పెంచబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం పొంచి ఉందని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామని అంటున్నారని అది భూమాత కాదు భూమేత అన్నారు.
Also Read:Harishrao:బీజేపీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే