కురవి వీరభద్రస్వామి దయవల్ల తెలంగాణ వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…తెలంగాణ వచ్చాక వీరభద్రస్వామికి బంగారు మీసం చేయిస్తానని మొక్కానని…తెలంగాణ రాగానే ఆ మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. ఎన్నికల రాగానే ఆగమాగం కావొద్దని…ఎన్నికల్లో నిలబడే వ్యక్తితో పాటు ఆ పార్టీ విధానాన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు.ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం అని పొరపాటు చేస్తే రాబోయే ఐదేళ్లు ఇబ్బందులు పడతామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన, తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పాలనలో హరిగోస పడ్డామన్నారు. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా గమనించాలన్నారు.తెలంగాణ వచ్చాక సంక్షేమంపై దృష్టి సారించామని అందులో భాగంగా తొలుత పెన్షన్ రూ.వెయ్యి ఇచ్చామని రాష్ట్ర సంపద పెరిగిన కొద్ది పెన్షన్ పెంచుకుంటూ పోయామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దానిని రూ.5వేలకు పెంచుతామని చెప్పారు.
తెలంగాణ వచ్చాక కరెంట్ లేదు, నీటి గోస,అనేక ఇబ్బందులు పడ్డామని కానీ ఓ ప్రణాళిక ప్రకారం ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగామని తెలిపారు. ఇవాళ దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతు బంధు, రైతు భీమా, ధాన్యం కొనుగోలు చేపట్టామన్నారు. ఈ దేశంలో రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు.50 ఏళ్ల రాజ్యంలో ఏనాడైన ప్రజల కళ్ల గురించి ఆలోచించారా..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటి వెలుగుతో పరీక్షలు చేయించామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా, 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడుతున్నారని వారికి ఓటు ద్వారా బుద్దిచెప్పాలన్నారు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యా నాయక్ గెలవాలన్నారు. యుద్ధం చేసే వాడి చేతిలోనే కత్తి ఉండాలన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని, సీతారామ, పాలమూరు ఎత్తిపోథల పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలన్నారు.
గిరిజన సోదరుల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందే బీఆర్ఎస్ అన్నారు. డోర్నకల్‌లో 85 తండాలు గ్రామ పంచయతీలుగా మారాయన్నారు. ప్రతి తండాకు రోడ్లు కావాలని అడిగే వ్యక్తి రెడ్యా నాయక్ అన్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు గెలిస్తే డోర్నకల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రెడ్యా నాయక్ కోరిన అన్నింటిని నెరవేరుస్తానని చెప్పారు. రెడ్యానాయక్ గెలిస్తే ఈ సారి ఆయన హోదా పెరుగుతుందన్నారు.
Also Read:Harishrao:కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలు