రైతుల మేలు కోసమే ధరణి తెచ్చామన్నారు సీఎం కేసీఆర్. బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…దుర్గం చిన్నయ్యను గెలిపించాలన్నారు. బెల్లంపల్లి చాలా చైతన్యవంతమైన ప్రాంతం అన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తితో పాటు ఆయన వెనకున్న పార్టీ గురించి ఆలోచించాలన్నారు. ఓటు తలరాతను మారుస్తుందని…ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేస్తుందన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించింది…కానీ ప్రజలకు చేసింది గుండు సున్నా అన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. తెలంగాణను ఆగం చేసి గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదిస్తే దిగొచ్చి తెలంగాణ ఇచ్చారన్నారు.
సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణిని ఆనాడున్న కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. ఆ తర్వాత సింగరేణిని నడకపలేక చేతులేత్తేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దీపావళి, దసరా కానుకగా కార్మికులకు బోనస్ రూ.1000 కోట్లు ఇచ్చామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కూడా పొగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆలోచించాలన్నారు. తెలంగాణ వచ్చాక నీటి తీరువా రద్దు చేశామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు తీసేయాలంటున్నారని, రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారన్నారు. రైతు బంధు ఉండాలంటే దుర్గం చిన్నయ్య గెలవాలన్నారు. రాబోయే రోజుల్లో రైతు బంధు ఎకరాకు రూ.16 వేలు అందిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఘోస పడతామని…అలాంటి తప్పు చేయవద్దన్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్‌కే ఓటు వేయాలన్నారు. ధరణిని వద్దన్న కాంగ్రెస్‌ను బంగాళా ఖాతంలో కలపాలన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడన్నారు. రెసిడెన్షియల్ కళాశాలలతో విద్యార్థుల జీవితాలు వెలుగులు తెచ్చామన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నారు. చెన్నూరులో చెల్లని కాంగ్రెస్ అభ్యర్థి బెల్లంపల్లిలో చెల్లుతారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలే మాకు బాస్ లు అని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.
Also Read:KCR:కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి