టిఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, జిహెచ్ఎంసి డివిజన్ ఇంచార్జిల సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఇటీవల మరణించిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సమావేశం నివాళి అర్పించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సమావేశంలో పాల్గొన్న వారు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ గుప్తాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న వారికి పరిచయం చేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో డివిజన్ ఇంచార్జిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను రెండు విడతలుగా ప్రకటిస్తామని, మొదటి విడత బుధవారం సాయంత్రం, రెండో విడత గురువారం ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో 67 వేల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ది కార్యక్రమాల జాబితాను తయారు చేసి, వాటిని డివిజన్ల వారీగా ఇంచార్జిలకు అప్పగించారు.డివిజన్ల వారీగా ఓటరు లిస్టులను, టిఆర్ఎస్ కార్యకర్తల జాబితాను కూడా ఇంచార్జులకు అందించారు.110 సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.