తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టారు. అనంతరం దీనిపై చర్చ కొనసాగుతోంది. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.ముందుగా తన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్న సభ్యులకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని.. ఈ సమకూర్చబడ్డ నిధులను ఎలా ఉపయోగించాలనేది కూడా ప్రధానం అని సీఎం పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరగవలసిన చర్చల సరళి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సక్రమైన చర్చలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్టు, అంకెలు మాత్రమే చెప్తరు అన్నట్టు మన దేశంలో ప్రబలి ఉందన్నారు. పార్లమెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల బడ్జెట్‌ల్లో కానీ రెండు విషయాలు గమనిస్తాం.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతమైన బడ్జెట్ అని అధికార సభ్యులు, పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని విపక్ష సభ్యులు అంటారు. బడ్జెట్‌పై విపక్షాలు విమర్శిస్తాయి.. ఈ విమర్శలు సహజమని కేసీఆర్ అన్నారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అన్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. మొట్టమొదటి దేశ బడ్జెట్ 190 కోట్లు.. దాంట్లో 91 కోట్లు రక్షణ రంగానికే. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు చెన్నారెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఏపీ బడ్జెట్ 680 కోట్లు. ఇప్పుడేమో లక్షల కోట్లలో మాట్లాడుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.