బీజేపీకి శంకరగిరి మాన్యాలే:సీఎం కేసీఆర్

300
kcr modi
- Advertisement -

ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. మిర్యాలగూడలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగసభలో మాట్లాడిన కేసీఆర్..మే 25 తర్వాత దేశాన్ని శాసించేది ప్రాంతీయ పార్టీలే అన్నారు.

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఓట్ల కోసం అబద్దాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. బీజేపీ పార్టీకి అడ్రస్ లేదన్నారు. తెలంగాణలో 118 సీట్లకు పోటీచేస్తే గెలిచింది ఒకే ఒక్కసీటని చెప్పారు.103 సీట్లలో డిపాజిట్ పోయిందన్నారు. ఎన్నికల తెల్లారి బీజేపీకి శంకరగిరి మాన్యాలేనని తెలిపారు సీఎం. మోడీ కాలం చెల్లిపోయిందని బీజేపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలన్నారు.

సోషల్ మీడియాలో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోడీ మహబూబ్ నగర్లో పచ్చి అబద్దాలు మాట్లాడరని…ఆయుష్మాన్ భారత్ గొప్పదా ఆరోగ్య శ్రీ గొప్పదా తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. మోడీ చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. రైతులు,గిరిజనులకు మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. ముస్లింలను అసలు పట్టించుకోరని దుయ్యబట్టారు. కాంగ్రెస్,బీజేపీ నేతలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడమే సరిపోతుందన్నారు.

చాయ్‌వాలా పోయి చౌకీదార్ వచ్చిండన్నారు. మైకులు పగిలిపోయేలా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం లేదన్నారు. బీసీలకు ఓ మంత్రిత్వ శాఖ కేటాయించాలని చెప్పినా మోడీ పట్టించుకోలేదన్నారు. బీసీలు ఈ దేశంలో కనిపించడం లేదా అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు.

బీజేపీ నేత లక్ష్మణ్ కన్నుమిన్నుగానకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతానని లక్ష్మణ్ అంటున్నారని అవన్ని కలలే అన్నారు. మే 25 తర్వాత భారతదేశ పరిపాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతుందన్నారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో లక్ష్మణ్ చెప్పాలన్నారు.

సర్జికల్ స్ట్రైయిక్స్ యూపీఏ హయాంలో 11 సార్లు జరిపారని అవన్నీ భయటికి చెప్పుకోరని మోడీ మాత్రం అదేదో పెద్ద విషయంగా చెబుతున్నారని తెలిపారు. ప్రజల గురించి ఆలోచించకుండా దేవుడు,దేవాలయాల గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. బీజేపీ సూడో హిందూత్వ పార్టీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు,రైతు బీమా ఎక్కడ లేదన్నారు.

ఇంతకముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బందీలుగా ఉన్నామన్నారు. మిర్యాలగూడలో ప్రతీ ఎకరానికి నీరు ఇస్తామన్నారు.సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే నరసింహరెడ్డి విజయం ఖాయమైనట్లేనని తెలిపారు కేసీఆర్. నల్లగొండ జిల్లా ప్రజలకు రాజకీయ విజ్ఞత ఎక్కువన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్నామని చెప్పారు.

నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తనదన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సంక్షేమంలో నెంబర్‌ వన్‌గా నిలిచామన్నారు. ఆంధ్రాలో ఇంతకాలం బందీలుగా ఉన్నామన్నారు. స్వరాష్ట్రంలో ఆరు నెలల్లోనే కరెంట్ కష్టాలను అధిగమించామన్నారు. రైతుల పంట పొలాలు ఎండనీయమని చెప్పారు.నల్లగొండ పార్లమెంట్ పరిధిలో 273 తండాలను పంచాయతీలుగా చేసుకున్నామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మనకే దక్కిందన్నారు. సోలార్ విద్యుత్‌లో దేశంలోనే నెంబర్‌2గా ఉన్నామన్నారు.

కాంగ్రెస్ నేతలు తాను 100 కోట్లు తీసుకొని నల్గొండ సీటు వేమిరెడ్డి నరసింహరెడ్డికి ఇచ్చానని అంటున్నారని అది ఎంతవరకు సమంజసం అన్నారు. కాంగ్రెస్ నేతలే ఉత్తమ్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారని దీనిపై ముందు వివరణ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఉత్తమ్ మళ్లీ ఏ మొఖం పెట్టుకుని పోటీచేస్తున్నారని చెప్పారు.

దేశంలో గత్తర లేపుతానని త్వరలో జాతీయ పార్టీని స్ధాపిస్తానని తెలిపారు. పేదల బ్రతకులు మారాలని ప్రాంతీయ పార్టీలకే అధికారం కట్టబెట్టాలన్నారు. బీజేపీ,కాంగ్రెస్‌లకు ప్రజల మీద ప్రేమ లేదన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే దేశంలో పోలికేక పెడతానని చెప్పారు. 16కు 16 ఎంపీ స్ధానాలను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి ఎలా ఆగుతుందో చూస్తానని చెప్పారు. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్,మోడీకి బానిసలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే పేగులు తెగేదాక కొట్లాడుతారని చెప్పారు. రాజీలేని పోరాటం చేసి తెలంగాణ జాతి గౌరవం పెంచుతానని స్పష్టం చేశారు.

- Advertisement -