CM KCR:సంక్షేమం అందని కుటుంబం లేదు

93
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబం లేదన్నారు సీఎం కేసీఆర్. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం కూడా 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని తెలిపారు.

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత, సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావద్దేశం ప్రశంసిస్తుందన్నారు. 76 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టి పీడిస్తుండటం దురదృష్టకరం అన్నారు.

మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తుంది తెలంగాణ సర్కార్ అన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది అన్నమాట అక్షర సత్యం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర పథకాలను అనుసరించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమన్నారు.

- Advertisement -