వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ: సీఎం కేసీఆర్

162
CM KCR
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని సిఎం చెప్పారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సిఎం చెప్పారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్టుమెంటు)గా మారుస్తున్నట్లు ప్రకటించారు.

జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదాను సిఎంకు అందించారు. ఈ ముసాయిదాపై సిఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి నాలుగు టిఎంసిలు, కృష్ణా నుంచి మూడు టిఎంసిలు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సిఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాలని సూచించారు. ముసాయిదాకు కొన్ని మార్పులు చెప్పారు. అధికారులు మరోసారి వర్క్ షాపు నిర్వహించుకుని సూచించిన మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.సమావేశంలో మంత్రులు ఈటల రాజెందర్, శ్రీనివాస గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీలు మురళీధర్ రావు, నాగేందర్ రావు, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, హరేరామ్, సిఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, పలువురు సిఇలు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి.

-ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. అలా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జల వనరుల శాఖ సంసిద్ధం కావాలి.

-జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సిఇని ఇంచార్జిగా నియమించాలి. ఇఇలు, డిఇల పరిధిలను ఖరారు చేయాలి. సిఇ ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులు, లిఫ్టులు, చెక్ డ్యాములు సాగునీటికి సంబంధించిన సర్వస్వం సిఇ పరిధిలోనే ఉండాలి.

-సిఇ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువులున్నాయో ఖచ్చితమైన లెక్కలు తీయాలి. ప్రాజెక్టుల ద్వారా మొదట చెరువులను నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సిఇ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం కావాలి. చెరువులు నింపే పని పకడ్బందీగా జరగాలి.

-పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఇఎన్సి నుంచి లష్కరు వరకు ఎంత మంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంత మంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాలు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఇఎన్సీలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఇఎన్సీ జనరల్, ఇఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఇఎన్సీ ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి.

-ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఇలా ప్రతీ చోటా ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాలు వేయాలి.అన్ని పంప్ హౌజుల నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి

-నరేగా ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పనులు చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలి.

-ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజులు నిర్మించాలి. సిఇలకు తమ పరిధిలో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలి.

- Advertisement -