శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం నోడల్ ఏజెన్సీ..

135
kcr
- Advertisement -

హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి , మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. ఈ దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఆ రెండు జిల్లాల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం.. అనే అంశం మీద ఇవాళ సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ శంభీపూర్ రాజు, శ్రీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీ బేతి సుభాష్ రెడ్డి, శ్రీ అరికెపూడి గాంధీ, శ్రీ కె.పి వివేకానంద, శ్రీ కాలె యాదయ్య, శ్రీ మాధవరం కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తున్నది. నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలు దిన దినాభివృద్ధి చెందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంతో పాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించే విధంగా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి. ఇందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు హైద్రాబాద్ నగరంలో మాదిరి విద్య వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెవాలి. అందుకు ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి.

ప్రజల ఆహార అవసరాలను గుర్తించి వారికి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు వంటి ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ గృహిణులకు అందుబాటులో ఉండే విధంగా విశాలమైన స్థలాలను ఎంపిక చేసి, వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలి. నిరంతరం నాణ్యమైన విద్యుత్ ను అందుబాటులో ఉంచడం, పటిష్టంగా రోడ్ల నిర్మాణం, మురుగునీరు వంటి పారిశుధ్యాన్ని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం, వరదల నివారణ ముంపు సమస్యలను అధిగమించడం వంటి పనులతోపాటు, రెవిన్యూ భూ రిజిష్ట్రేషన్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలి. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్ తో పోటీ పడుతు అభివృద్ది చెంది, శాటిలైట్ టౌన్ షిప్పుల నిర్మాణం వూపందుకుని అత్యంత సుందరంగా రూపుదిద్దుకుని, భవిష్యత్తులో హైదరాబాద్ ముఖ చిత్రాన్నిమరింత గుణాత్మకంగా మార్చివేయడం ఖాయం అని సీఎం అన్నారు.

- Advertisement -