నూతన సచివాలయంలో ఇవాళ అధికారులతో తొలి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై మధ్యాహ్నం అధికారులతో రివ్యూ చేయనున్నారు. దీంతో పాటు కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల పనులపై కూడా సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం సందర్భంగా ఆరు కీలక దస్త్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సీఎం సంతకం చేశారు.
పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుమీద సీఎం రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాలవారిగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు.
Also Read:May Day:కార్మిక దినోత్సవం
సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ పంపిణీ జరుగనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యం గా ఎంచుకున్న నేపథ్యంలో 6.84 లక్షల మంది గర్భిణులు లబ్ధిపొందనున్నారు. కాగా ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది.
Also Read:నేడుమహారాష్ట్ర అవతరణ దినోత్సవం
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలుమీద సీఎం సంతకం చేశారు. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు.