ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడిందని, ఇదే స్పూర్తితో యాసంగి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలనే విషయంలో రైతులకు మార్గదర్శకం చేయడంతో పాటు, ఆ పంటకు సంబంధించిన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉండేట్లు చూడాలని కోరారు.
‘‘గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈ సారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితో పాటు, మంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10-12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, ఆరేడు లక్షల ఎకరాల్లో మక్కలు, నాలుగు లక్షల ఎకరాల్లో శనగలు, ఐదు లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాలలో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి.
దీనికి సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులోకి తేవాలి. వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయాలి. నియంత్రిత పంట సాగు విధానం అంటే ఇదే. ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుని, దానికి అనుగుణమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం’’ అని సిఎం చెప్పారు.