KCR:అంబేద్కర్ అందరివాడు

48
- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుడు కనబరిచిన దార్శనికతతోనే దళిత, గిరిజన, బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని, ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు.

తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3 ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి పొందుపరిచారని సిఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు, డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మహానుభావుడు మనల్ని నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సిఎం తెలిపారు.
125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సిఎం కేసీఆర్ అన్నారు.

దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో,అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా వుండాలని సిఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ గారి పుట్టిన రోజు సందర్భంగా జరుపతలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం.. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని సిఎం గుర్తు చేసుకున్నారు. ఇందుకు పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని సిఎం తెలిపారు. నేను ఊహించిన దానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు వొక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు అని సిఎం కేసీఆర్ తన ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహా రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని సిఎం కేసీఆర్ ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డా.బిఆర్ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజల కోసం భవిష్యత్తు తరాల కోసం రాజ్యంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసా పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం దళితులు,గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు… వివక్షను ఎదుర్కునే ప్రతీ చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారమవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేము. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే..’’ అని సిఎం అన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకున్నామన్నారు. ఇటువంటి చారిత్రాత్మక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వారికి సిఎం పలు సూచనలు చేశారు.విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు వారి సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో వుంచాలని సిఎం తెలిపారు. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీల్లు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ ఏర్పాట్లన్ని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సిఎం ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -