పల్లె ప్రగతి దిగ్విజయం- సీఎం కేసీఆర్‌

410
pragathi bhavan
- Advertisement -

గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ(పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలు అయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అన్ని గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించి, విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లో కెల్లా నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపిఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సిఎం అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని సిఎం పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం స్పష్టం చేశారు.

గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. విజయదశమి శుభాకాంక్షలు చెప్పి, సిఎం ప్రసంగం ప్రారంభించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ 30 రోజుల కార్యక్రమం అమలులో అనుభవాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమిష్టి ప్రణాళిక, సమిష్టి కార్యాచరణ, సమిష్టి అభివృద్ధి అనే ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పిసిసిఎఫ్ శోభ, డిస్కమ్ ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

pragathi bhavan

 

పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ స్పూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశ్యంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సిఎం వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. ప్రతీ నెలా గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని,ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని సిఎం అన్నారు. చెట్లు పెంచే పనులకు, చెత్త ఎత్తేవేసే పనులకు నరేగా నిధుల వాడుకోవాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని ఇచ్చామని, అవసరమైన నిధులను విడుదల చేశామని, ఇప్పటికైనా గ్రామాల్లో మార్పు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు ప్రధాన బాధ్యత తీసుకుని, నిధులను సక్రమంగా వినియోగించుని, గ్రామాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. గ్రామ స్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగాలని చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

-30 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్ధేశించిన పనులు చాలా వరకు జరిగాయి. స్మశాన వాటికలు, డంపు యార్డులు, నర్సరీల ఏర్పాటుకు చాలా గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మిగిలిన గ్రామాల్లో కూడా వీలైనంత తొందరలో స్థలాలను గుర్తించాలి. ఏ శాఖ పరిధిలో ఉన్నా సరే, ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సామాజిక అవసరాల కోసం వాడుకోవాలి.
-వార్షిక, పంచవర్ష ప్రణాళికలు కూడా తయారయ్యాయి. గ్రీన్ ప్లాన్ కూడా సిద్ధమయింది. దానికి అనుగుణంగా పనులు జరగాలి.
-గ్రామ పంచాయతీలు చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనుక్కోవాలి. ప్రతీ ట్రాక్టర్ కు ట్యాంకర్, ట్రాలీ, ఫ్రంట్ బ్లేడ్ ఉండాలి.
-గ్రామాభివృద్ధి పనులను పర్యవేక్షించే డిపిఓ, డిఎల్పీవో, ఎంపిఓలకు క్రమం తప్పకుండా అలవెన్సులు అందించాలి.
-ప్రతీ గ్రామంలో విధిగా నర్సరీ నిర్వహించాలి. మేకలు, ఇతర పశువులు మొక్కలను తినకుండా కంచె ఏర్పాటు చేయాలి.

pragathi bhavan

విద్యుత్ శాఖ నెంబర్ వన్..

30 రోజు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో విద్యుత్ శాఖ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందని సిఎం కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు. విద్యుత్ శాఖ సిబ్బంది 30 రోజుల కార్యాచరణ ముగిసినప్పటికీ, ఇంకా గ్రామాల్లో పనులు చేస్తూనే ఉన్నారని అభినందించారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి నుంచి గ్రామాల్లో విద్యుత్ సంబంధ సమస్యలు ఉంటున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటి దాకా ఇంత పెద్ద ప్రయత్నం జరగలేదన్నారు. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు,కార్మికులను సిఎం అభినందించారు. నిర్ధేశించిన పనుల్లో ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తి చేసిన విద్యుత్ శాఖ, మిగతా పనుల కోసం ఇప్పటికీ గ్రామాల్లో విధులు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు.

విద్యుత్ శాఖ చేసిన పని ఇదీ..

-30 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ గ్రామాల వారీగా పవర్ వీక్ నిర్వహించింది.
-వంగిన, తుప్పు పట్టిన సంభాలు 1,67,154 ఉన్నట్లు గుర్తించారు. వంగిన వాటిని సరిచేశారు. తుప్పు పట్టిన వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేశారు. రెండు పోళ్ల మధ్య దూరం ఉండడం వల్ల వైర్లు వేలాడ కుండా, అక్కడ మరో స్తంభం వేస్తున్నారు.
-గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ కోసం 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారు.
-వీధిలైట్ల కోసం ఏర్పాటు చేసిన 7,527 కరెంటు మీటర్లు పాడైపోయినందున, వాటి స్థానంలో కొత్త మీటర్లు మిగిస్తున్నారు.
-వీధిలైట్ల నిర్వహణ కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారు.

ఎస్టీ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు కోసం కమిటి..
ఏజన్సీ ప్రాంతాలతో పాటు, ఇతర ఎస్టీ తండాలు, గూడేలున్న ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పరిష్కరించడానికి ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ నియమించారు. సోమేశ్ కుమార్, రఘునందన్ రావు, అజయ్ మిశ్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం..
పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గం సమావేశంలో చర్చించి, ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ముగ్గురు కలెక్టర్లకు అభినందన..
గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లును సిఎం ప్రత్యేకంగా అభినందించారు.

కలెక్టర్ పరిధిలో రెండు కోట్ల నిధులు..
గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతీ జిల్లా కలెక్టర్ కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు సిఎం చెప్పారు. ఈ నిధులు కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని చెప్పారు.

అడవులు తక్కువున్న చోట ప్రత్యేక శ్రద్ధ..
తెలంగాణలో పచ్చదనం పెంచే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని సిఎం సూచించారు. అడువులు తక్కువున్న కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు.

30 రోజుల్లో జరిగిన పని..

-రాష్ట్రంలోని 12,748 గ్రామాల్లో సమస్యలను గుర్తించేందుకుగాను పాదయాత్రలు నిర్వహించి, గ్రామ వార్షిక ప్రణాళికలు తయారు చేశారు. మరో 3 గ్రామాల్లో రూపొందించాల్సి ఉంది.
-ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీల్లో మొత్తం 8,20,727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఎంపికయ్యారు.
-ఇండ్లు, ఖాళీస్థలాల్లో శిథిలాల తొలగింపు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం 1,24,837 ప్రదేశాలను గుర్తించి, వీటిలో 1,09,784 చోట్ల (87.94 శాతం) పనులు పూర్తి చేశారు.
-పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మ తొలగింపు కోసం 2,77,657 ప్రదేశాలను గుర్తించి, వీటిలో 2,67,535 చోట్ల (96.35 శాతం) పనులు పూర్తి చేశారు.
-పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు 1,07,288 ఖాళీ ప్లాట్లు, కమ్యూనిటీ స్థలాలను గుర్తించి, వీటిలో 99,770 చోట్ల (92.98 శాతం) పారిశుద్ధ్య పనులు పూర్తి చేశారు.
-వివిధ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న 22,167 బావులను గుర్తించి, వీటిలో 16,380 (73.89 శాతం) బావుల్ని పూడ్చివేశారు. వీటితోపాటు 11,065 పనికిరాని బోరుబావులను గుర్తించి, వీటిలో 9,888 (89.36శాతం) బోరు బావుల్ని పూడ్చి వేశారు.
-గ్రామాల్లో 68,862 పల్లపు ప్రాంతాల్ని గుర్తించి, వీటిలో 64,540 (93.72శాతం) చోట్ల చదును చేశారు.
-62,723 ప్రదేశాల్లో రోడ్లు, గుంతల్లో నీరు నిలిచినట్లు గుర్తించి, వీటిలో 58,856 చోట్ల (93.83శాతం) నీరు నిల్వకుండా మరమ్మతు పనులు చేశారు.
-మొత్తం 1,30,775 ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 1,25,791 చోట్ల (96.19శాతం) బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లించారు.
-82,804 ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్ వాడీ కేంద్రాలు మొదలైనవి అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 80,420 సంస్థలను (97.12శాతం) శుభ్రం చేశారు. మొత్తం 29,25,390 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారు.
-ఇప్పటివరకు 10,870 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలు అవసరమని గుర్తించి, మరో 1881 గ్రామ పంచాయతీల్లో గుర్తించాల్సి ఉంది.
-డంప్ యార్డుల కోసం 11,211 గ్రామ పంచాయతీల్లో స్థలాలను గుర్తించారు. మరో 1,540 గ్రామాల్లో గుర్తించాల్సి ఉంది.
-మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో 12,750 గ్రామాలు హరితహారం ప్రణాళికను సిద్ధం చేశాయి. వీటిలో 12,292 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి.
-30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 732.14 లక్షలు(7.32 కోట్ల) మొక్కలను వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో నాటారు.
-గ్రామపంచాయతీ రోడ్లు,కూడళ్ళ వద్ద 24,244 కి.మీ.ల పొడవునా 80.88 లక్షల మొక్కలను నాటారు.
-గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో 40,522 కి.మీ. విస్తీర్ణంలో 260.48 లక్షల మొక్కలను నాటగా, ఇంటి ఆవరణలో నాటేందుకు 226.62 లక్షల మొక్కలను పంపిణీ చేశారు.
-గ్రామాల్లోకి వచ్చిన కోతులను అడవులబాట పట్టించేందుకు ఉద్దేశించిన మంకీ ఫుడ్ కోర్టులను 1063 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.

- Advertisement -