రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు..

187
CM KCR

జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యలో ఎట్ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.

సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు స్వాతంత్ర్య సమరయోధులను, ప్రజాప్రతినిధులను, హైదరాబాద్‌లో ఉండే ముఖ్యమైన ప్రభుత్వ అధికారులను, ప్రముఖ విద్యాసంస్థల అధిపతులను, ప్రముఖ వైద్యశాలల అధిపతులను, కేంద్ర ప్రభుత్వ సంస్థల అధిపతులను, మాజీ న్యాయమూర్తులను, జాతీయ పురస్కారాలు అందుకున్న ప్రముఖులను, ప్రముఖ క్రీడాకారులను, ప్రముఖ కళాకారులను, పారిశ్రామిక వేత్తలను, ఐటి కంపెనీల ప్రతినిధులను, విద్యావేత్తలను, బార్ అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు.