ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతి భవన్ లో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఎండకాలంలో రైతులు ఇబ్బందిపడకుండా నీటిని అందించాలని చెప్పారు. కృష్ణా నది ప్రాజెక్టులకు నీరందకపోతే గోదావరి నీరు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ రూపొందించాలన్నారు. ఖమ్మం జిల్లాను ఆకుపచ్చగా చేయాలని పిలుపునిచ్చారు. దుమ్ముగూడెం నుంచి బయ్యారం వరకు గోదావరి నీరు ఎత్తిపోసి సాగునీరివ్వాలన్నారు. అవసరమైన చోట్ల జలాశయాలు, ఎత్తిపోతలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రాజెక్టుల ద్వారా నీరు అందని ప్రాంతాలను గుర్తించి.. స్థానిక వనరుల ద్వారా సాగునీరు అందించాలన్నారు. సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లాను ఆకుపచ్చ గా చేయాలని సూచించారు. ఆ జిల్లాకు ఒక్క జురాల ప్రాజెక్ట్ ద్వారానే నీరందించడం వల్ల నీరు సరిపోవడం లేదని అందువల్ల శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా నీటిని ఎత్తిపోయాలని అధికారులకు సూచించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్ఫష్టం చేశారు.