తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏపీలో ప్రజల కష్ట సుఖలు పట్టని బాబు ఎన్నికల పేరుతో తెలంగాణలో తిష్టవేయడం, కాంగ్రెస్‌తో కలిసి కూటమి పెట్టి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను లేకుండా చేస్తానని ప్రతిని బూనడం, హైదరాబాద్‌లోని పలు కీలక నియోజక వర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి టీఆర్‌ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్‌పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజలకు అతిగా అనిపించింది. ఈ విషయం గ్రహించని బాబు కూటమి అధికారంలోకి వస్తుందని కలలు కన్నారు. హద్దులు దాటి టీఆర్ఎస్ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
అసలే తెలంగాణలో టీడీపీ పార్టీ పత్తాలేదు.. దానికి తోడు కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకోవడంతో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అయితే గతంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అవసరానికి మించి వేలు పెట్టారు. దాంతో రావాల్సిన పది.. పన్నెండు సీట్లు టీడీపీకి రాకపోగా గెలవాల్సిన కాంగ్రెస్‌కు సైతం ఓటర్లు చేయిచ్చేలా చేయటంలో చంద్రబాబు పాత్ర కీలకమన్న మాట రాజకీయ విశ్లేషకుల నుండి వినిపించింది.
ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. తెలంగాణ విషయంలో జోక్యం చేసుకున్న దానికి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖాయమన్న మాటను చెప్పారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాట ఎంతలా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఆయన మాటలకు తగ్గట్లే.. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా.. దాని కారణంగా నష్టం కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్త పడ్డారు కేసీఆర్. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ముందు పోలవరం మీద.. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ కు లాభంగా మారాయని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలంటే జగన్ అధికారంలోకి రావాలన్న భావన ఏపీ ప్రజల్లో వచ్చిన పరిస్థితి. దీనికి తోడు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బైబై బాబు అన్న మాటను ఏపీ ప్రజలు చెప్పేసినట్లుగా చెప్పాలి. బాబు ఓటమిలో జగన్ పాత్రను తక్కువ చేయలేం. అదే సమయంలో కేసీఆర్‌ను మర్చిపోలేం. మొత్తంగా కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ బాబుకు ఎగ్జిట్ పోల్స్ తో అందినట్లేనన్న మాట వినిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మింగుడుపడేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ ఢిల్లీలో ప్రధానిని నిర్ణయించేది తానేనని చెప్పుకున్న చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆయన ఆశలను ఆడియాశలు చేసినట్లయ్యాయి. మరి బాబుకు కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్.. జగన్ చేతికి అధికారం అన్న మాటను కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.