బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి..!

621
cm kcr
- Advertisement -

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై సీనియర్‌ అధికారులతో సీఎం భేటీ ఆయ్యారు.

సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. బడ్జెట్‌ కేటాయింపులు తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో భారీ కోత విధించారని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రావాల్సిన నిధుల్లో రూ.3731కోట్లు తగ్గాయని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడమంటే కేంద్రం అసమర్థతేనని ఆయన తప్పుబట్టారు. జీఎస్టీ బకాయిల విషయంలోనూ కేంద్రం మోసం చేసిందన్నారు.కేంద్ర బడ్జెట్‌లో అన్ని ప్రధానరంగాలకు కోత విధించారని కేసీఆర్ ఆరోపించారు.

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24వేల కోట్ల సాయం చేయాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు కేటాయించలేదు. రాష్ట్రం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు లేవు. 2019-20లో ఏకంగా 18.9 శాతం నిధులు తగ్గడం కేంద్ర అసమర్థతకు నిదర్శనం. 2020-21 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కూడా రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తున్నారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -