తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా వివిధ రకాల చెల్లింపులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసకున్నారు.సీఎం నుంచి బంట్రోతు దాకా జీతాల్లో కొంత వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత తప్పలేదు. అంతేకాదు, రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధించారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో మాత్రం 10 శాతం కోత విధించారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం తెలిపారు.

