మున్సిపల్ శాఖ పనితీరు భేష్: సీఎం కేసీఆర్

127
CM KCR
- Advertisement -

హైదరాబాద్, వరంగల్ తో పాటు అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా మున్సిపల్ శాఖ బాగా పనిచేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం ప్రగతి భవన్ లో వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిని సిఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా వరంగల్ లో తలెత్తిన పరిస్థితితో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఇతర పట్టణ ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు వివరించారు.‘‘భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటిలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైన, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయమిచ్చాం అన్నారు.

ఒక్క వరంగల్ నగరంలోనే 4,750 మందిని శిబిరాలకు తరలించాం. రాష్ట్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 1,898 ఇండ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని కూడా శిబిరాలకు తరలించాం. రెండేళ్ల క్రితం నుంచి హైదరాబాద్ నగరంలో డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను నిర్వహిస్తున్నాం. ఇందులోని 339 మంది సుశిక్షితులైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వీరికి పూర్తి స్థాయిలో ఎక్విప్ మెంట్ కలిగిన 50 వాహనాలు కూడా ఉంటాయన్నారు.

హైదరాబాద్ తరహాలోనే డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోకూడా వాడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సిద్ధంగా ఉండే విధంగా డిఆర్ఎఫ్ తయారైంది. వీటికి తోడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీములను కూడా అన్ని నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి, తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నం’’ అని కేటీఆర్ వివరించారు.విపత్తుల సమయంలో మున్సిపల్ శాఖ అద్బుతంగ పనిచేస్తున్నదని సిఎం అభినందించారు. ఇతర దేశాలు, దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో అనుసరించే వ్యూహాన్ని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి అనుగుణమైన విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని సిఎం కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరులో ప్రొఫెషనలిజం కనిపించాలని సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -