నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం నిలబడిన వ్యక్తులు మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అని కొనియాడారు సీఎం కేసీఆర్. శాసనమండలిలో వాజ్‌పేయి,కరుణానిధి సంతాప తీర్మానాన్ని వేర్వేరుగా ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడిన సీఎం..వాజ్‌పేయి అజాత శత్రువు అని అన్నారు. ముక్కుసూటిగా,నిష్కర్షంగా మాట్లాడే గొప్ప వ్యక్తి వాజ్ పేయి అని తెలిపారు.
అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారని… దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఎవరూ గొప్ప పనులు చేసినా పొగిడేవారని…. ఇందిరాగాంధీని వాజపేయి అపరకాళీగా అభివర్ణించారని గుర్తుచేశారు. వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని జవహర్ లాల్ నెహ్రు చెప్పారని…. నెహ్రు మాటలను వాజపేయి నిజం చేశారన్నారు.
భారతదేశ చరిత్రలో వాజపేయి చిరస్థాయిగా నిలిచిపోతారని… దేశానికి ఉత్తమమైనటువంటి పరిపాలన అందించారన్నారు. అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని… అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు.
దక్షిణాది రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప నేత కరుణానిధి అని చెప్పారు సీఎం కేసీఆర్. చివరినిమిషం వరకు తాను నమ్మిన సిద్దాంతం కోసం పాటు పడ్డారని గుర్తుచేశారు. 17 సంవత్సరాల్లోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీకి 49 సంవత్సరాలు అధ్యక్షుడిగా 60 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారన్నారు. సినిమా రంగంలోనూ కరుణా అద్భుతంగా రాణించారని ఆయన రాసిన ప్రతి స్క్రిప్ట్ సూపర్ అన్నారు. కరుణానిధి కృషి వల్లే ఆగస్టు 15న ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఎగురవేస్తున్నారని చెప్పారు.