రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29-2021న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మొదటి సంవత్సరంలోనే ధరణి సాధించిన ప్రగతి అభినందనీయం. సంఖ్యలు తమకు తాముగా మాట్లాడతాయి. ఈ ఏడాదిలో ధరణి వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్‌లను సాధించగా, ధరణి ద్వారా దాదాపు 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. ఇంతకు ముందు పట్టాదార్ పాసుపుస్తకాలు ఇవ్వని దాదాపు 1,80,000 ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చారు. నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ఎప్పటికప్పుడు, స్టేక్ హోల్డర్ ల నుండి సలహాలు, సూచనలకనుగుణంగా సరికొత్త లావాదేవీల మాడ్యూల్స్ జోడించబడ్డాయి. వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా ప్రత్యేక మాడ్యూల్స్ పొందుపరచారు. . ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందాన్ని, అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో ధరణి పౌరుల సేవలో మరిన్ని విజయాలు సాధిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణిని విజయవంతంగా అమలు చేసినందుకు అన్ని అధికారులు, జిల్లా కలెక్టర్లు మరియు తహశీల్దార్లకు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ధరణి పురోగతి వివరాలు..
– హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
– బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
– పూర్తయిన లావాదేవీలు : 10,00,973
– విక్రయాలు : 5,02,281
– గిఫ్ట్ డీడ్ : 1,58,215
– వారసత్వం : 72,085
– తనఖా : 58,285
– పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
– పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
– భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
– నిషేధించబడిన జాబితా : 51,794
– కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618