ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి ఆదర్శం- సీఎం కేసీఆర్‌

48
- Advertisement -

ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు సీఎం కేసీఆర్‌. ఆయన ఢిల్లీపర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ శనివారం సర్వోదయ ప్రభుత్వ స్కూల్‌ను సీఎం కేజ్రీవాల్‌తో కలిసి సందర్శించారు. అనంతరం ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్నారన్నారు. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇందు కోసం తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని, ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయం చేయాలని చెప్పామన్నారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు.

పాఠశాల పనితీరు, కాన్సెప్ట్‌ బాగుందని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అఖిలేష్‌, కేజ్రీవాల్‌తో భేటీపై ప్రస్తావించారు. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని, పవిత్రస్థలంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దన్న కేసీఆర్‌.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతామన్నారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని, ఆ సంచలనం జరిగి తీరుతుందని చెప్పారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారన్నారు. ఏకపక్షంగా కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చిందని తప్పుబట్టారు. కొత్త విద్యావిధానంపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించలేదని విమర్శించారు. ఢిల్లీ తరహాలో విద్యావిధానం ఉంటే తామూ ఆమోదిస్తామని, కానీ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేసీఆర్ విమర్శించారు.

- Advertisement -