ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత,సీఎం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం కావటంతో నవంబర్ 24న శుభ ముహూర్తం రోజున సీఎం కొత్త క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టే అవకాశాలున్నాయి.కొత్త క్యాంపు ఆఫీసు నిర్మాణంలో భాగంగా అమ్మవారి ఆలయాన్ని తొలగించిన సంగతి తెలిసిందే.
గతంలో నిర్దేశించిన మూడు బ్లాక్‌లకు బదులు ఎత్తై ఒకే భవన సముదాయం నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కనీసం పది అంతస్తుల భవనం నిర్మించి చివరి (టాప్) ఫ్లోర్‌ను సీఎంవోకు కేటాయించాలని సూచించారు. కేవలం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు. అందుకు తగిన కొత్త డిజైన్లు తయారు చేయించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త సచివాలయం అత్యద్భుతంగా ఉండాలని, చూడగానే అందరినీ ఆకట్టుకునే కళా నైపుణ్యం ఉట్టిపడాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలో పనిచేస్తున్న దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు వీలుగా వెయ్యి వాహనాలు నిలిపేలా పార్కింగ్ జోన్, రెస్టారెంట్, ఒక హెలిపాడ్, గుడి, మసీదు, చర్చి, పార్కుతోపాటు ఉద్యోగుల చిన్న పిల్లలను ఉంచేలా క్రెచెను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కొత్త ఆదేశాలతో విస్తీర్ణం తగ్గిపోవటంతో ఈ వ్యయం రూ. 150 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కొత్త నిర్మాణాల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ కార్యాలయాలున్న భవనాలను సైతం తమకు అప్పగించాలని, అంత మేరకు ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని సీఎం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఏపీ సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సైతం ఇటీవలె గవర్నర్ నరసింహన్‌ను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు పై కేసీఆర్ అధ్యక్షతన రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.