ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం జరిగిందని నిధులివ్వాలని..తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వండని కోరారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో జీఎస్టీ బకాయిలతో పాటు నీతి ఆయోగ్ చెప్పిన రూ.24వేల కోట్లు రాలేదని తెలిపారు. నీటి ప్రాజెక్టులకు సహకారమందించాలని…కొత్త విమానాశ్రయాలకు అనుమతులివ్వండని కోరారు. సిద్దిపేట ఎయిర్‌పోర్ట్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్.రెండు రోజుల క్రితం ప్రధాని సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేయగా, అది దేశానికే గర్వకారణంగా నిలిచే సౌధం అవుతుందని ప్రధానిని సీఎం కేసీఆర్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరున్నరేండ్లే అయినా వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరుపై ప్రధానమంత్రి ఆసక్తిని చూపటమే కాకుండా ప్రశంసలు కూడా కురిపించినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమ ద్వితీయ మజిలీగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవటంపై ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసించినట్టు తెలుస్తోంది.