గ్రామాలు అభివృద్ది చెందటమే తమ ముందు ఉన్న లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో మంగళవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం. ఏకపక్ష విజయం సాధించినందుకు వారికి పేరుపేరునా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను వివరించారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే మన వెనుక వున్న జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్ గా అదే వస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారం కొరకు మీదగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినండి. వాళ్ళను కూచోబెట్టి మర్యాద చేయండి అని వారికి సూచించారు సీఎం కేసీఆర్.